UPDATES  

NEWS

 రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ భూములను కాపాడాం..! సీఎం రేవంత్‌ రెడ్డి షాకింగ్ కామెంట్స్..

మియాపూర్‌లో 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ, గతంలో జరిగిన భూ లావాదేవీలపై మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు తెలిపారు. మియాపూర్‌ భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

మియాపూర్‌ భూముల వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన బంధువు దామోదర్‌రావు, గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌పై రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ భూ లావాదేవీల్లో లగ్జరీ కార్లు లంచంగా ఇచ్చారని, నగదు రూపంలో ముడుపులు అందాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఈ వ్యవహారంపై పోరాడుతున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మియాపూర్‌ భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 

ఐఎంజీ భూములు, కంచ గచ్చిబౌలి, మామిడిపల్లి, గుర్రంగూడ అటవీ భూములు, మంచిరేవులలోని 143 ఎకరాలు సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కాపాడినట్లు సీఎం వివరించారు. ఈ వ్యవహారాల్లో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భూముల అంశాలనూ ప్రస్తావించారు. పద్మాలయ స్టూడియోస్‌, లాంకో భూముల కేసులను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పరిష్కరించలేదని కేసీఆర్‌, హరీశ్‌రావును ప్రశ్నించారు. హరీశ్‌రావు మామ హన్మంతరావుపై కూడా ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు చేశారు. ఇవన్నీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలే. 

ప్రభుత్వ భూములను విక్రయించి వచ్చిన నిధులను విద్య, సాగునీరు, వైద్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం భూముల విక్రయ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తిస్తుందని తెలిపారు. మియాపూర్‌ తీర్పుపై కేసీఆర్‌, కేటీఆర్‌ స్పందించాలని, అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |