UPDATES  

NEWS

 కరవుకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణం ..! ఇది ‘రేవంత్‌ వృష్టి’ హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులకు ప్రకృతి కారణం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. ‘‘ఇది అతివృష్టి కాదు.. అనావృష్టి కాదు.. రేవంత్‌ వృష్టి’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదుల్లో పుష్కలంగా నీళ్లున్నా.. పంపులు నడిపి పొలాలకు నీటిని అందించలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు.

దేవాదుల ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం కేవలం 18 టీఎంసీలకే పరిమితమైందని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నీటిని దిగువకు వదిలేస్తుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు వాటిని ఒడిసిపట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో తగినంత నీరు ఉన్నా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద పూర్తిస్థాయిలో మోటార్లు నడపడం లేదని విమర్శించారు. మరోవైపు చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు నీటిని తరలించుకుపోయారని పేర్కొన్నారు.

గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో పంటల బీమాపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు.. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయడం మరిచిపోయారని విమర్శించారు. పంటల బీమా అమల్లో ఉంటే రైతులకు కొంతైనా నష్టపరిహారం అందేదని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కరవు సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతులకు అందిస్తున్నారని గుర్తుచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఉన్నా కనీసం క్యాబినెట్‌ సమావేశంలోనూ దీనిపై చర్చించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |