UPDATES  

NEWS

 ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..! ఆ రోజు కౌంటింగ్..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరంలో కీలక ఘట్టమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా ఉదయం పోలింగ్ మందకొడిగా సాగినా, మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. చెదురుమదురు ఘర్షణలు, వాగ్వాదాలు మినహా పోలింగ్ ప్రక్రియ చాలా వరకు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 58.55% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి ఈ శాతం 65 నుంచి 68 శాతం మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా, కొన్ని గిరిజన, తీర ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తక్కువగా నమోదైనట్లు సమాచారం. ఈ ఎన్నికల బరిలో నిలిచిన సుమారు 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగినప్పటికీ, పల్నాడు, అనంతపురం, చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. కొన్ని చోట్ల ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనల వల్ల పోలింగ్‌కు పెద్దగా అంతరాయం కలగలేదు.

పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీళ్లు వేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ వాటిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఏవైనా కేంద్రాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే, నవంబర్ 6న అక్కడ రీ-పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాల ఆధారంగా నవంబర్ 11, 12 తేదీల్లో ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |