ఏపీలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కార్పొరేషన్, మున్సిపాలిటీలు కాకుండా పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. పొత్తుల విషయంలో చివరివరకు కాస్త తర్జనభర్జన కొనసాగినా కొన్ని జిల్లాల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగడంతో చిన్నపాటి దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో అల్లూరు జిల్లా జెడ్పీని వైసీపీ దాదాపు కైవసం చేసుకునట్టే !
ఏపీలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి జైత్రయాత్ర కొనసాగుతోంది. కేవలం కార్పొరేషన్లు, మున్సిపాటిలీలు కాకుండా జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. దాదాపు 70 శాత సీట్లను గెలుచుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్న సమయంలో ప్రజాదరణ తగ్గలేదని తేలిపోయింది. పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం మొదలు చిత్తూరు జిల్లా వరకు కూటమి హవా కొనసాగింది.
ఎక్కడ కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా రూరల్ నియోజకవర్గాల కూటమి నేతలు గట్టి పట్టు సాధించారు. బ్యాలెట్ పోరులోనూ తమకు ఎదురులేదని నిరూపించారు. మొత్తం 28 జెడ్పీ పీఠాలకు 27 కూటమి వశం కానున్నాయి. కేవలం ఒక్క పీఠం వైసీపీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అర్ధరాత్రి రెండు గంటల వరకు వెలువడిన ఫలితాల మేరకు 659 జెడ్పీటీసీ సీట్లకు 77 ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
జడ్పీటీసీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఏడు జిల్లాల్లో సంపూర్ణ విజయం సాధించింది. అందులో పల్నాడు, అనకాపల్లి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, మార్కాపురం జిల్లాల్లోని దాదాపు అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది!
ఎన్నికలు కేవలం 582 చోట్ల జరిగాయి. అందులో కూటమి 473 సీట్లు గెలుచుకుంది. అందులో టీడీపీ 383, జనసేన -70, బీజేపీ-19, వైసీపీ-57, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందాయి. కొన్ని చోట్ల ఇంకా లెక్కింపు జరుగుతోంది. ఇక ఎంపీపీ స్థానాల విషయానికి వద్దాం. మొత్తం 9821 సీట్లు కాగా, 2051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు కేవలం 7767 సీట్లకు జరిగాయి. అందులో కూటమి 5819 సీట్లను దక్కించుకుంది. టీడీపీ-4754, జనసేన-945, బీజేపీ-120, వైసీపీ-1583, ఇతరులు 187 సీట్లు గెలుపొందారు.
ఉత్తరాంధ్ర ఏజెన్సీ బెల్టులో ఫ్యాన్ గిరగిరా తిరిగింది. ఎంపీపీ, జెడ్పీ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య పొత్తులు సరిగా కుదరలేదు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి బరిలోకి అభ్యర్థులు దిగారు. మొదటి నుంచి అల్లూరి జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ఉవ్విల్లూరిన జనసేనకు అక్కడ ఊహించని షాక్ తగిలింది. ఆ జిల్లాల్లో వైసీపీకి ఓటర్లు పట్టం కట్టారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాల్లో వైసీపీ ఓటమి పాలైనా, కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆ పార్టీకి పరువు దక్కింది.







