UPDATES  

NEWS

 ఏపీకి కేంద్ర బృందం.. తుపాను నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

అర్నబ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు, అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితులను పరిశీలించేందుకు రెండు వేర్వేరు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం వెల్లడించారు.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం శని, ఆదివారాల్లో (అక్టోబర్ 31, నవంబర్ 1) తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. రియల్-టైమ్ గవర్నెన్స్ (RTGS) సెంటర్‌లో తుపాను సమయంలో తీసుకున్న చర్యలు, నష్టంపై అధికారులు కేంద్ర బృందానికి వివరించనున్నారు. అనంతరం ఈ బృందం రెండుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. ఒక బృందం కోనసీమ, కాకినాడ జిల్లాల్లో, రెండో బృందం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నష్టాన్ని పరిశీలిస్తుంది. ఈ బృందం సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది.

ఇదిలా ఉండగా, 2026 ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మయ్ గోట్మారే నేతృత్వంలోని మరో బృందం నవంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తుంది. పది మంది సభ్యులున్న ఈ బృందం రెండుగా విడిపోయి శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించి రైతులు, అధికారులతో మాట్లాడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 283 మండలాలను తీవ్ర కరవు, 105 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బృందం నవంబర్ 4న ముఖ్యమంత్రితో భేటీ కానుంది.

తుఫాను నష్టం అంచనా బృందం సభ్యులు: చిత్తరంజన్ దాస్ (జాయింట్ సెక్రటరీ, హోంశాఖ), ప్రశాంత్ ఆర్మోరికర్ (వ్యవసాయ శాఖ), రేఖారాణి కొల్లు (జలశక్తి మంత్రిత్వ శాఖ), హిమాలయ గర్గ్ (ఆర్థిక శాఖ), రాకేశ్ కుమార్ సింగ్ (రోడ్డు రవాణా), అలోక్ జవహర్ (గ్రామీణాభివృద్ధి), ప్రణయ్ గర్గ్ (విద్యుత్ శాఖ), డా. ఎస్.వి.ఎస్.పి. శర్మ (ఇస్రో).

కరవు అధ్యయన బృందం సభ్యులు: చిన్మయ్ గోట్మారే (జాయింట్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ), ప్రభా కాంతి (MNCFC), వినోద్ సమంత్ (గ్రామీణాభివృద్ధి), పంకజ్ పహాడియా (ఆర్థిక శాఖ), ఎన్.వి. సతీష్ శీమకుర్తి (డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్), డా. కె. పొన్నుసామి (నూనె గింజల అభివృద్ధి), అనురాధ బటానా (నీతి ఆయోగ్), ధీరేంద్ర కుమార్ (RIC), ప్రదీప్ కుమార్ (ప్రజా పంపిణీ), డా. సాక్షి భదౌరియా (పశుసంవర్ధక శాఖ).

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |