UPDATES  

NEWS

 దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్..!

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించేలా కంపెనీలు పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు మంత్రిని కలిసి ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమీకృత ఆయిల్‌పామ్ యూనిట్‌కు, ఇప్పటికే అమలులో ఉన్న తెలంగాణ ఆహార శుద్ధి మరియు పరిరక్షణ విధానం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి,పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక విధానం కింద లభించే ప్రయోజనాలకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ మంజూరుకు చొరవ తీసుకోవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు

యూనిట్‌కు అవసరమైన రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరవ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే మొట్టమొదటి సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు అదనంగా 35 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ఆధునిక ఆయిల్‌పామ్ మిల్లును ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కంపెనీకి అదనపు జిల్లాలను కేటాయించాలని, ఆయిల్‌పామ్ గెలల ధరలను నిర్ణయించే సమయంలో కంపెనీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

అంజనాపురం ఆయిల్‌పామ్ యూనిట్‌కు సంబంధించిన రహదారి విస్తరణ, భూమి కేటాయింపు తదితర అంశాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఆయిల్‌పామ్ సాగు చేపడుతున్న జిల్లాల్లో సాగు లక్ష్యాలను రెట్టింపు చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణతో పాటు రైతులకు నాణ్యమైన మొక్కలను అందించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన మొక్కలు, షార్ట్ వెరైటీ మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దేశంలోనే మొట్టమొదటి సీడ్ గార్డెన్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా, గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ సీఈఓ సునిల్ కటారియా, గ్రూప్ హెడ్ కార్పోరేట్ అఫైర్స్ రాకేష్ స్వామి పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |