UPDATES  

NEWS

 ఆధార్ తరహాలో ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్..

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ, పారదర్శక భూ రికార్డుల నిర్వహణ లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించే విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.ఉపగ్రహ చిత్రాలతో కూడిన భూ పటాలను పట్టాదారు పాస్ పుస్తకాల్లో పొందుపరచనున్నట్లు చెప్పారు.

సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, భూ సర్వే, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి సమస్యలు తదితర అంశాలపై మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. గతంలో అమల్లో ఉన్న ధరణి విధానంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపుతూ, భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.

తొలి విడతలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సర్వేను పూర్తి చేసి, భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డులకు సంబంధించి స్పష్టత తీసుకురావాలని అధికారులకు సూచించామని తెలిపారు.ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇదే తరహా సమీక్షా సమావేశాలు నిర్వహించామని, ఎనిమిదో సమావేశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.నిరుపేదలు, భూములు కలిగిన రైతులు సహా అన్ని వర్గాల ప్రజల హక్కులకు రక్షణ కల్పించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సుమారు 90 శాతం ఇళ్లను అర్హులైన పేదలకు కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేటాయించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన ఇళ్లను కూడా 15 రోజుల్లోగా అర్హులకు కేటాయించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నీటి లభ్యతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సింగూరు వంటి ప్రాజెక్టుల్లో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇతర ప్రాజెక్టుల్లోనూ తాగునీటి లభ్యతకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెండో పంట సాగుకు అవసరమైన నీరు, విద్యుత్‌ను సమకూర్చేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా, నీటి లభ్యతే ప్రధాన సమస్యగా మారే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ సమస్య ఒక్క తెలంగాణకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. నీటి కొరతపై ప్రజలు, రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించడంలో ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కోరారు.

అఖిలపక్ష సమావేశం..

రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను అందించి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ లు ప్రతీక్ జైన్, హైమావతి,ప్రతిమ సింగ్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |