UPDATES  

NEWS

 బొత్స సత్యనారాయణకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ..

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్యకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు బొత్స చైతన్య నామినేషన్ వేశారు. అయితే, ఆయనకు పూసపాటిరేగ మండలంలో కాకుండా విజయనగరం నగరంలో ఓటు ఉందంటూ జనసేన నాయకులు ప్రాదేశిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం స్థానిక మండల పరిధిలో ఓటు లేకపోవడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన రిటర్నింగ్ అధికారి, పరిశీలన అనంతరం చైతన్య నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి ఏకపక్షంగా నామినేషన్‌ను రద్దు చేశారని ఆరోపిస్తూ వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. పార్టీ న్యాయవాదులతో కలిసి ఆయన ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేశారు. నిబంధనలకు అనుగుణంగానే తమ అభ్యర్థి నామినేషన్ వేశారని, ఆర్‌ఓ నిర్ణయాన్ని సమీక్షించి న్యాయం చేయాలని వారు కోరారు.

ముఖ్యమైన నాయకుడి కుటుంబ సభ్యుడి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు చైతన్య పోటీ భవితవ్యం ఆధారపడి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |