UPDATES  

NEWS

 ఉమ్మడి చిత్తూరులో ఎలక్షన్ హీట్.. నామినేషన్ల రగడ..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ వెదర్ ఫుల్ హీటెక్కింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలో.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దశ నుంచే వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, అడ్డంకుల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పుంగనూరు, తంబలపల్లి, చిత్తూరు, తిరుపతి సహా.. పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయ్. మున్సిపల్ ఎన్నికల్లోనూ నామినేషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

చిత్తూరు కార్పొరేషన్‌లో.. 60 డివిజన్లకు 1321 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీలో 257 నామినేషన్లు తిరస్కరణకు గురవగా.. 1,064 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. మేయర్ పదవికి 14 నామినేషన్లు దాఖలవగా.. 13 చెల్లుబాటయ్యాయి. నామినేషన్ల విత్ డ్రా తర్వాత.. 51 డివిజన్లు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 48 డివిజన్లు టీడీపీ ఖాతాలో పడగా.. జనసేన, బీజేపీ, వైసీపీకి ఒక్కో డివిజన్ దక్కినట్లు తెలుస్తోంది. అయితే, నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయి. దాంతో.. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డివిజన్‌కు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని.. రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ విత్ డ్రా చేసిన అభ్యర్థుల పేర్లు, పార్టీలు, దరఖాస్తు అందిన తేదీ, ఉపసంహరణకు గల కారణాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో.. నామినేషన్ల ప్రక్రియపై అధికారుల పరిశీలనకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇక చిత్తూరు జిల్లాలో రెండు రోజుల్లో 27 జడ్పీటీసీ స్థానాలకు 181 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి జిల్లాలో 35 జడ్పీ స్థానాలకు 386 నామినేషన్లు వచ్చాయి. అన్నమయ్య జిల్లాలో 25 జడ్పీటీసీ స్థానాలకు 277 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ 3 జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాలకు వేలల్లో నామినేషన్లు వచ్చాయి. ఇప్పుడు.. నామినేషన్ల పరిశీలనపైనే వివాదం రేగుతోంది. స్క్రూటినీ పేరుతో.. తమ పార్టీ అభ్యర్థుల పత్రాలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తోందని.. వైసీపీ ఆరోపిస్తోంది. నామినేషన్ల దశలోనే.. అభ్యర్థులను పోటీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రూల్స్ ప్రకారమే నామినేషన్ల పరిశీలన జరగాలని, అర్హులైన అభ్యర్థుల పత్రాలను తిరస్కరించొద్దని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా.. నామినేషన్ల స్క్రూటినీ ప్రాసెస్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |