UPDATES  

NEWS

 ర్యాపిడో డ్రైవర్ ముసుగులో జైషే ఉగ్రవాది..!

జైషే మహమ్మద్ తో సంబంధాలు కలిగిన ర్యాపిడో డ్రైవర్ ను ముంబయిలో మహారాష్ట్ర యాంటీ టెర్రస్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడ్ని అధికారులు సుదీర్ఘంగా విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు మహమ్మద్ హసన్ అబు సర్మద్ అక్తర్.. ర్యాపిడో డ్రైవర్ గానే కాకుండా పెర్ఫ్యూమ్ వ్యాపారిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. వాటి ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఏటీఎస్ అధికారులు తేల్చారు. పాకిస్థాన్ నిఘా వర్గాల ఆపరేషన్‌తో నిందితుడికి సంబంధాలున్నట్లు గుర్తించారు.

మతపరమైన ద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు, జైషే మహమ్మద్ చీఫ్ రెచ్చగొట్టే ప్రసంగాలను నిందితుడు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా బాబ్రీ మసీదుకు సంబంధించి మౌలానా మసూద్ అజార్‌కి చెందిన ఉగ్రవాద ఆడియో క్లిప్‌లను ‘ఇండియన్ ముస్లిం’ అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇతను షేర్ చేసినట్లు వెల్లడైంది. అంతేకాకుండా పాకిస్థాన్‌కు చెందిన ‘IBN E Qasim’ అనే రాడికల్ టెలిగ్రామ్ ఛానెల్‌ను కూడా అతను సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు తెలిసింది.

మరోవైపు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అక్తర్ అనేక రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ‘అబ్ జిహాద్ కా జమానా ఆగయా హై’ (ఇది జిహాద్ చేసే సమయం) అంటూ హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు అక్తర్ చేశాడు. ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై కూడా నిందితుడు స్పందించాడు. ‘ఇందిరా గాంధీలాగే ప్రధాని మోదీని కూడా ఏదో ఒకటి చేయాల్సి ఉంది భాయ్ లోగ్’ అంటూ మాజీ ప్రధాని హత్యను గుర్తుచేసేలా వివాదస్పద పోస్ట్ పెట్టాడు.

మరోవైపు నిందితుడు అక్తర్ గురించి పక్కింటిలో ఉంటున్న వ్యక్తి కీలక విషయాలు వెల్లడించారు. గత 3 నుంచి 3.5 సంవత్సరాలుగా అక్తర్ అదే ప్రాంతంలో అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు తెలిపారు. ‘ఇతను ఇలాంటి పనులు చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. రోజూ బయట కూర్చున్నప్పుడు పలకరించేవాడు. పగటిపూట పెర్ఫ్యూమ్స్ అమ్ముతూ, రాత్రిపూట ఎక్కడో పనికి వెళ్లేవాడు. ఇతను చెడ్డవాడని ఎప్పుడూ అనిపించలేదు’ అని పేర్కొన్నారు. అయితే, దేశద్రోహానికి పాల్పడే ఎవరినైనా కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |