UPDATES  

NEWS

 తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పొదుపు బాటలో ప్రభుత్వం..!

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో విద్యుత్, నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఉత్పత్తి, లభ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పొదుపు చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

పగటి వేళల్లో అత్యవసరమైతే తప్ప ఎయిర్ కండిషనర్లను (ఏసీ) వినియోగించవద్దని, వాటిని కూడా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్దే నిర్వహించాలని స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఏసీల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేనప్పటికీ, వ్యవసాయ, గృహ అవసరాలకు నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నామని తెలిపారు. 

పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ కోతలు విధించడం లేదని, పారిశ్రామిక యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే తాగునీరు, విద్యుత్ కొరతను నివారించేందుకు క్షేత్రస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంజయ్ జాజు సూచించారు. ఈ అంశంపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం, కేబినెట్ సబ్-కమిటీ భేటీ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

నీటి కష్టాలు.. అక్రమ మోటార్లపై ఉక్కుపాదం

స్థానిక నీటి వనరుల నుంచి వ్యవసాయానికి అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడేస్తుండటంతో, విద్యుత్ లోడ్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఇంధన శాఖ అధికారులు సమావేశంలో వివరించారు. మంజీరా, సింగూరు రిజర్వాయర్ల నుంచి నీటి లభ్యత లేకపోవడంతో, అక్కడి నుంచి అందాల్సిన 110 మిలియన్ గ్యాలన్ల నీటిని మిషన్ భగీరథ (60 MGD), కృష్ణా నది వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలకు తప్ప నిర్మాణాలకు, ఇతర పనులకు కొత్త బోర్ల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు. నగరంలో మున్సిపల్ నల్లా కనెక్షన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడ్పతున్న వారిపై ‘హైడ్రా’ సహకారంతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

నవంబర్ 1 నుంచి నిర్మాణాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని (ఎస్‌టీపీ వాటర్) సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్నాయని, తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేస్తున్నామని మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |