UPDATES  

NEWS

 లక్నోలో రావణుడిగా ఎలాన్ మస్క్..! సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్..!

దసరా పండుగ సమీపిస్తున్న వేళ, ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన కొన్ని పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో పాటు పలువురు రాజకీయ, అంతర్జాతీయ ప్రముఖులను రావణుడి పది తలలుగా చిత్రీకరిస్తూ ఈ పోస్టర్లను ఏర్పాటు చేయడమే ఈ వివాదానికి కారణమైంది. ‘సనాతన రక్షా సంఘటన్’ అనే సంస్థ నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసింది.

‘భారత వ్యతిరేక పది తలల రావణుడు’, ‘సనాతన భారత వ్యతిరేక రావణుడు’ అనే శీర్షికలతో వీటిని ప్రదర్శించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం సంప్రదాయం. ఇదే స్ఫూర్తితో తమ దృష్టిలో దేశానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకులుగా భావించిన వారిని రావణుడి రూపంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ పోస్టర్లలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్, అంతర్జాతీయ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్, బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ పాలకుడు మహమ్మద్ యూనస్, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇటీవల మరణించిన గ్యాంగ్‌స్టర్లు అతీక్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీ వంటి వారి ముఖాలను రావణుడి తలలుగా చేర్చారు.

ఈ పోస్టర్లు వెలిసిన వెంటనే రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా తమ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ చిత్రాన్ని గమనించిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో ఈ పోస్టర్లను తొలగించినట్లు సమాచారం. దేశీయ రాజకీయ నాయకులతో పాటు ఎలాన్ మస్క్, జార్జ్ సోరోస్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను ఈ జాబితాలో చేర్చడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. 

మతపరమైన పండుగను రాజకీయ నిరసనకు వేదికగా మార్చుకున్న ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీయడంతో పాటు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |