UPDATES  

NEWS

 పురపోరులో వైసీపీకి అభ్యర్థుల కరవు.. 8 చోట్ల ఛైర్మన్ పీఠాలు ఏకగ్రీవం.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో అధికార కూటమికి పలుచోట్ల పోటీ లేకుండా పోయింది. రాష్ట్రంలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో ఛైర్మన్ పదవులకు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో, ఆ స్థానాలు అధికార కూటమికి ఏకగ్రీవం కానున్నాయి.

ప్రకాశం జిల్లాలోని దర్శి, పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, గురజాల నగర పంచాయతీలతో పాటు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని యర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాల్లో కేవలం కూటమి అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ పదవులన్నీ అధికారికంగా ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు.

మరోవైపు, జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని గూటిలో వైసీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ వారు నామినేషన్లు వేయలేదు. జమ్మలమడుగు స్థానానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య పేరును ఖరారు చేసినప్పటికీ, ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అక్కడ కొందరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వారు కూడా ఉపసంహరించుకుంటే ఆ సీట్లు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

వైసీపీ కంచుకోటలుగా భావించే పులివెందుల, పుంగనూరు, కమలాపురం వంటి ప్రాంతాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. తొలిదశలో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఆదివారం రాత్రి నాటికి 388కి పైగా వార్డులలో వైసీపీ తరఫున ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |