UPDATES  

NEWS

 ఏపీ పురపోరు.. చివరి రోజు వెల్లువెత్తిన నామినేషన్లు..

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం 25,819 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన నిన్న‌ ఒక్కరోజే భారీగా 17,291 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం.

చివరి రోజు అందిన నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే, 13 నగరపాలక సంస్థల్లో మేయర్ పదవుల కోసం 244 మంది, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్ పదవుల కోసం 765 మంది నామినేషన్లు వేశారు. అలాగే కార్పొరేటర్ స్థానాలకు 5,532, కౌన్సిలర్ స్థానాలకు 10,750 నామినేషన్లు చివరి రోజున అభ్యర్థుల నుంచి అందాయి.

మూడు రోజుల గడువులో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్యను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మేయర్ పదవుల కోసం 330 మంది, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులకు 1,038 మంది పోటీలో నిలిచేందుకు నామినేషన్లు సమర్పించారు. ఇక, కార్పొరేటర్ స్థానాలకు 8,198, కౌన్సిలర్ స్థానాలకు 16,253 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని నేడు చేపట్టనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అనంతరం అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |