కొండలా పేరుకుపోయిన ట్రాఫిక్ చలానాల వసూలుకు సుప్రీం కోర్టు షాకింగ్ సూచనలు చేసింది. చలానా బకాయిలను కరెంట్ బిల్లులు.. ఇతర ప్రభుత్వ బకాయిలకు జత చేసి వసూలు చేసే దారులను అన్వేషించవచ్చని పేర్కొంది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై దాఖలైన ఓ కేసును సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వాహనదారుల నుంచి చెల్లించని ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేవలం ఇ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని.. అవి వసూలయ్యేలా చూడాలని ఆదేశించింది.
ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే విద్యుత్ బిల్లులతోపాటు ఇతర ప్రభుత్వ బకాయిలకు వాటిని లింక్ చేసి ఆ మొత్తాన్ని వసూలు చేసే మార్గాలను అధికారులు అన్వేషించవచ్చని జస్టిస్ జె.బి.పార్దివాలా తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు రూ.45 వేల కోట్ల ఇ-చలాన్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు కోర్టుకు తెలిపారు. దీంట్లో ఇప్పటివరకు దాదాపు రూ. 25 వేల కోట్లు వసూలు అయ్యాయని చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్ పార్దివాలా క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
పోలీసులు వేలు, లక్షల సంఖ్యలో ఈ-చలాన్లు జారీ చేయవచ్చని వాటి ద్వారా విధించిన జరిమానాలను వసూలు చేయడమే అసలైన సమస్య అని జస్టిస్ పార్దివాలా అన్నారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లు గల వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పునరుద్ధరణను నిలిపివేయడం వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపారు. అలాంటి సందర్భాలలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయవచ్చన్నారు. ఆయా వాహనాల యాజమాన్య బదిలీని కూడా నిరోధించవచ్చని పేర్కొన్నారు. ఒక వాహనం చలాన్లు క్లియర్ అయ్యే వరకు దాని ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీ చేయకూడదని సూచించారు.
పరివాహన్ పోర్టల్‌లో అటువంటి వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం , పెండింగ్ లో ఉన్న చలాన్లతో ముడిపడి ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణను నిలిపివేయడం వంటి చర్యలను కూడా పరిశీలించాలని తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయడం, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్లు జారీ చేయడానికి నిరాకరించడం వంటి చర్యలను కూడా సూచించారు. వాహనాలను రోడ్లపై తనిఖీ చెక్ చేసి ఇ-చలాన్ పెండింగ్ లో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది.







