సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ దర్యాప్తులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రూ.2.1 కోట్ల నగదు లావాదేవీలపై వివరణ తీసుకునేందుకు ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. సాహితీ ఇన్‌ఫ్రా ఖాతాల నుంచి గాంధీకి సుమారు రూ.2.1 కోట్ల మేర బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
తెలంగాణ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థపై ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించి, వాటిని దారి మళ్లించారనే ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది.
ఈ కేసులో సంస్థకు, సంబంధిత వ్యక్తులకు చెందిన ఆస్తులపై గతంలో ఈడీ చర్యలు తీసుకుంది. రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ బూడాటి లక్ష్మీనారాయణను 2024లో అరెస్ట్ చేశారు.








