తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి నిధుల కొరతతో వెనుకబడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిధుల లేమితో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు.
2016 నుంచి 2023 మధ్య ఏర్పాటైన 74 కొత్త మున్సిపాలిటీలు సొంత ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలుగా మారినప్పటికీ అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, కొహిర్, ఇంద్రేశం వంటి మున్సిపాలిటీలు అప్‌గ్రేడ్ అయినా ఇంకా గ్రామీణ పరిస్థితుల్లోనే ఉన్నాయని అంజిరెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు లేక, స్థానికంగా పనులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, పేరుకు మాత్రమే మున్సిపాలిటీలు ఉన్నాయని విమర్శించారు.







