బాలికల విద్య, సాధికారత, వ్యక్తిత్వ వికాసం, ఉన్నత కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కార్యక్రమ నిర్వహణ సన్నాహాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్యారోగ్య, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఆదర్శంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బాలికలకు భవిష్యత్ ఉపాధి అవకాశాలు, కెరీర్ మార్గాలపై సమగ్ర అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







