సూర్యాపేట: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోలీసు భద్రత’ పథకం అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన యాదగిరి కుటుంబానికి ‘పోలీసు భద్రత’ పథకం కింద నగదు మంజూరైంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కుటుంబ సభ్యులకు మంజూరైన నగదు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే అనుకోని పరిస్థితుల్లో వారి కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా ఉంటాయని తెలిపారు. మృతి చెందిన సిబ్బంది కుటుంబాల సంక్షేమం, వారి భద్రతకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.







