రేణిగుంట మండలంలోని విమానాశ్రయం సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆరోపించింది. పాఠశాలలో ఒక్క వంట మాస్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, వంట మాస్టర్ అసిస్టెంట్లు, క్లీనింగ్ సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులే వంటశాలలో పనులు చేయాల్సి వస్తోందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి హరినాథ్ తెలిపారు.
మంగళవారం ‘సామాజిక శంఖారావం సర్వే’లో భాగంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి హరినాథ్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కె. ఈశ్వరమ్మ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలో అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా వంట మాస్టర్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి విద్యార్థులతో వంటశాల పనులు చేయించే పరిస్థితికి ముగింపు పలకాలని వారు కోరారు.







