UPDATES  

NEWS

 కొత్తగా రూ.1,000 నోటు వస్తోందా..? సోషల్ మీడియాలో వైరల్..!

దేశంలో కొత్తగా రూ.1,000 నోటు విడుదల కానుందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ నకిలీ ప్రచారాలని స్పష్టం చేసింది. కొత్త రూ.1,000 నోటు విడుదలపై ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఆర్‌బీఐ) ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించింది.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో పసుపు రంగులో ఉన్నట్లు కనిపించే రూ.1,000 నోటు చిత్రాలు వైరల్‌ అయ్యాయి. కొత్త నోటును ఇప్పటికే విడుదల చేశారని, మరికొందరు నిర్దిష్ట తేదీన అందుబాటులోకి రానుందని ప్రచారం చేశారు. దీంతో కొత్త నోటు వస్తుందా? అంటూ నెటిజన్లలో చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చింది. కొత్త రూ.1,000 నోటు విడుదలైందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పని పేర్కొంది. ఇలాంటి వార్తలను నమ్మే ముందు అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని, నిర్ధారణ కాని పోస్టులను ఇతరులకు షేర్‌ చేయవద్దని ప్రజలకు సూచించింది.

ప్రస్తుతం దేశంలో ఆర్‌బీఐ మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించినప్పుడు అప్పటివరకు చెలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లు చట్టబద్ధమైన చెల్లింపుల హోదాను కోల్పోయాయి. అనంతరం కొత్త డిజైన్‌తో రూ.500 నోటును ప్రవేశపెట్టారు. అయితే, రూ.1,000 నోటును తిరిగి చెలామణిలోకి తీసుకురాలేదు.

దాని స్థానంలో ప్రవేశపెట్టిన రూ.2,000 నోటును కూడా ఆర్‌బీఐ 2023 మేలో చెలామణి నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రకటించింది. కాబట్టి కొత్త రూ.1,000 నోటుపై అధికారిక ప్రకటన వచ్చిందంటూ ప్రచారం చేసే పోస్టులను ప్రజలు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |