UPDATES  

NEWS

 సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ..! కారణం అదేనా..?

తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా ఉండటానికి నవంబర్ 6న జరగాల్సిన టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను వెంటనే వాయిదా వేయాలనిమాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీడిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. శనివారం సీఎం కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నిరుద్యోగులు కొత్త నోటిఫికేషన్ల కోసం కండ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారని.. కనీసం వచ్చిన అవకాశాలనైనా అందుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీల నిర్వాకం అభ్యర్థుల పొట్టగొట్టేలా ఉందని మండిపడ్డారు.

టీజీపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ-సివిల్) పరీక్ష నవంబర్ 6న జరగాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) జూనియర్ ఇంజినీర్ (జేఈ) పరీక్షలు నవంబర్ 2 నుంచి 6 వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఒకే సిలబస్, ఒకే అర్హత కలిగిన రెండు కీలక పరీక్షలు ఒకే సమయంలో రావడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఎస్ఎస్‌సీ జేఈ పరీక్షా కేంద్రాలను ఇతర రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల్లో కేటాయించారని.. నవంబర్ 5, 6 తేదీల్లో అక్కడ పరీక్ష రాసే అభ్యర్థులు వెంటనే తెలంగాణకు తిరిగి వచ్చి ఏఈఈ పరీక్ష రాయడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువత రెండు ఉద్యోగ అవకాశాల్లో ఒకదాన్ని బలవంతంగా వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై అభ్యర్థులు ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారని, శాంతియుతంగా నిరసనలు కూడా చేశారని హరీశ్ రావు గుర్తుచేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అక్టోబర్ 14న టీజీపీఎస్సీకి లేఖ రాసి, పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన పరిష్కారం లభించకపోవడం శోచనీయమన్నారు.నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సైతం తమ పరీక్షల తేదీలను మార్చుకున్నాయని.. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బేషజాలకు పోతూ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని తీవ్రంగా ఖండించారు.

నిరుద్యోగ యువత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు అడగడం లేదని, తాము కష్టపడి సిద్ధమైన రెండు పోటీ పరీక్షలకూ హాజరయ్యే అవకాశం కల్పించమని మాత్రమే కోరుతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని నవంబర్ 6న జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. శనివారం నిరుద్యోగులు హరీష్ రావును కలిసి వినతిపత్రం సైతం అందజేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |