UPDATES  

NEWS

 ఆర్గనైజ్డ్ క్రైమ్‌తో ఎన్నికలు ఆపేందుకు జగన్ అండ్ కో కుట్ర: టీడీపీ నేత వర్మ..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే జగన్ గుండెల్లో వణుకు మొదలైందని, ప్రజల తిరుగుబాటును చూసి ఓటమి భయంతో ఎన్నికలను ఏదో ఒక రకంగా ఆపేందుకు ‘గొడ్డలి పార్టీ’ కుట్రలు పన్నుతోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్గనైజ్డ్ క్రైమ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే జగన్ అండ్ కో నైజమని ఆయన మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అడ్డుకోవడానికి వైసీపీ ముఠా విశ్వప్రయత్నాలు చేస్తోందని వర్మ ఆరోపించారు. దీని వెనుక ఉన్న కారణం స్పష్టమని, బూత్‌ల స్థాయిలో గతంలో చేసిన ట్యాంపరింగ్ బండారం బయటపడుతుందని, చనిపోయిన వారి పేర్లతో దొంగ ఓట్లు వేయించుకోవడం, రిగ్గింగ్ చేయడం ఇకపై సాధ్యం కాదనే భయంతోనే జగన్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రక్షాళనను చూసి గిలగిలా కొట్టుకుంటున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించకుండా, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా, పంచాయతీలకు నిధులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కోర్టుల్లో ఏకంగా 59 కేసులు వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలను అణచివేయడమే వైకాపా నైజమని, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం బీసీల పక్షపాతిగా నిలిచి, స్థానిక సంస్థల్లో 34 శాతానికి పైగా స్థానాలు కేటాయించి వారిని రాజకీయంగా ప్రోత్సహించారని తెలిపారు.

వైసీపీపై ప్రజల్లో విశ్వాసం పూర్తిగా అడుగంటిందని, దీంతో ఉనికి కోల్పోతామనే భయంతో దాడులకు దిగుతూ వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడుతున్నారని వర్మ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ హింస చెలరేగినా అది పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నికలు ఆపేందుకు వైసీపీ పన్నుతున్న వ్యూహంలో భాగమేనని ప్రజలు గ్రహించాలన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కేవలం రాయలసీమలోని 15 సమస్యాత్మక ప్రాంతాలు, ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఒకవైపు ఆ పార్టీ నేత కోన రఘుపతి ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రశంసిస్తుంటే, మరోవైపు జగన్ అనుచరులు ఎన్నికల వ్యవస్థపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.

2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన దుర్మార్గాలను ఎవరూ మరిచిపోలేదని, టీడీపీ అభ్యర్థులను భయపెట్టి వెయ్యికి పైగా నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేశారని వర్మ ఆరోపించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, చంద్రగిరి, పులివెందుల, మాచర్ల వంటి మున్సిపాలిటీల్లో ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని, పిఠాపురంలో నడిరోడ్డుపై బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటే, ఏకంగా 500 మంది గూండాలను వెంటేసుకుని వచ్చి ప్రజలపై, పోలీసులపై దాడులు చేశారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు స్వయంగా గూండాయిజం చేయడం, విధుల్లో ఉన్న పోలీసులపై మాజీ మంత్రి రోజా దురుసుగా ప్రవర్తించడం వారి ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమన్నారు. ఇలాంటి గూండా సంస్కృతిని ప్రజలు సహించబోరని, జగన్ రెడ్డి కుట్రలను తిప్పికొడతారని స్పష్టం చేశారు. అశాంతిని సృష్టించే వైసీపీ మూకలపై ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యం గెలవడం ఖాయమని వర్మ ధీమా వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |