UPDATES  

NEWS

 ఎల్‌నినో ఎఫెక్ట్..! రేషన్ కార్డుదారులకు కొత్త సరుకులు..!

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేందుకు 14 నెలల వరకు అవసరాలను తీర్చేలా ఆహార ధాన్యాల నిల్వలను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వ్యవసాయ సీజన్లలో వర్షపాతం తగ్గినా రేషన్‌ సరఫరాలకు అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం నిల్వల నిర్వహణకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రానున్న వరి పంట దిగుబడిపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం కింద మధ్యాహ్న భోజనం తదితర అవసరాలకు కలిపి నెలకు సుమారు 2.38 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమన్నారు. వార్షిక అవసరం 28.56 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని,2026 అక్టోబర్‌ 16 నాటికి రాష్ట్రంలోని బఫర్‌ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇందులో కేంద్ర పూల్‌, ఇతర సంక్షేమ పథకాల కింద 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, రాష్ట్ర పూల్‌ కింద 6.14 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌), ఇతర గుర్తించిన సరఫరాల ద్వారా మరో 18.39 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందాల్సి ఉందన్నారు.

ప్రస్తుత నిల్వలు, అందాల్సిన బియ్యం కలిపితే మొత్తం లభ్యత 28.03 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పరిమాణం ప్రజాపంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు సుమారు 11.7 నెలలపాటు, అంటే 2027 సెప్టెంబర్‌ వరకు సరిపోతుందని వివరించారు. మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యం నిర్ణీత గడువులోగా ప్రభుత్వ గోదాములకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో భవిష్యత్తులో పంటలు దెబ్బతిన్నా లక్షలాది కుటుంబాల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాలపై పడే భారాన్ని తగ్గించేందుకు రేషన్‌ వ్యవస్థ ద్వారా గోధుమ పిండితోపాటు ఎంపిక చేసిన నిత్యావసర వస్తువులను అందించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు., చక్కెర, చింతపండు, కారం పొడి తదితర వస్తువుల పంపిణీ అంశం సమీక్షలో చర్చకు వచ్చిందని, సబ్సిడీ ధరలకు అందించడంతోపాటు వివిధ పంపిణీ విధానాలకు సంబంధించిన వ్యయ అంచనాలను అధికారులు సమర్పించారు. లబ్ధిదారులకు అందించాల్సిన పరిమాణాలు, సరుకుల సేకరణ ఏర్పాట్లు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని సమగ్రంగా లెక్కించాలని సూచించారు. ఈ వివరాలతో ప్రతిపాదన సిద్ధం చేసిన అనంతరం పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.సమీక్షలో పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |