UPDATES  

NEWS

 స్థానిక ఎన్నికలు ఆలస్యమంటూ పుకార్లు..! ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మరో రెండు నెలల సమయం పడుతుందంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నేడు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో దీనిపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు, రాజకీయ పార్టీలు వీటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసులలో స్పష్టత వచ్చాకే కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుందంటూ జరుగుతున్న ప్రచారం తమ దృష్టికి వచ్చిందని పునేఠా తెలిపారు. ఎన్నికలు ఆలస్యమైనా, అంతర్గత ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

ఈ వార్తలన్నీ కల్పితమైనవని, కమిషన్ అధికారికంగా జారీ చేసినవి కావని ఆయన స్ప‌ష్టం చేశారు. ప్రజలు ఇలాంటి ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మడం గానీ, ఇతరులకు పంపడం గానీ చేయవద్దని సూచించారు.

కమిషన్ పేరుతో తప్పుడు, కల్పిత సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటే, అది కేవలం అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌తో సరిచూసుకున్నాకే విశ్వసించాలని కోరింది.

ఇటీవలే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజన ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. 

మరోవైపు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూడా ఎస్ఈసీ సన్నాహాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 23తో మండల ప్రజా పరిషత్‌లు, సెప్టెంబర్ 24తో జిల్లా ప్రజా పరిషత్‌ల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |