UPDATES  

NEWS

 రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు..!

తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లిన కేటీఆర్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతు భీమా, 2 లక్షల ఉద్యోగాల కల్పన హమీ ఎగవేత వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

నిరసన సమయంలో రాహుల్ గాంధీ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లే.. తాము కూడా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా నల్ల టీ షర్ట్ ధరించినట్లు కేటీఆర్ తెలిపారు. కానీ తమని సభలోకి అడుగు పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారన్నారు. దాడి చేయడమే కాకుండా ఉల్టా తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కోరుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి , నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారని.. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫామ్ హౌస్ పై దాడి చేసేందుకు ఉసిగోల్పారని కేటీఆర్ ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద చావు డప్పు కొట్టారని మండిపడ్డారు. తాము అనని మాటలను అన్నట్టు స్పీకర్ కు ఆపాదించారని పేర్కొన్నారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ ను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు రాష్ట్ర శాసన సభను దుశ్సాసన సభగా మార్చేశారని కేటీఆర్ ఆరోపించారు. కాగా అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై తాము చేసిన ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని పిలిపించి.. ఈ ఘటనపై మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ తరహా అప్రజాస్వామిక ఘటనలు మంచివి కాదని గవర్నర్ సైతం అభిప్రాయపడ్డారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |