ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా మద్దతు మరింత పెరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారీ స్థాయిలో ఆయుధాలు, వేలాది మంది సైనికులను రష్యాకు పంపిన పియాంగ్‌యాంగ్.. తాజాగా మరో కీలక అడుగు వేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది. రష్యా సైనిక అవసరాలను తీర్చేందుకు ఉత్తర కొరియా తన సహకారాన్ని మరింత విస్తరిస్తున్నట్లు పేర్కొంది.
తాజా సమాచారం ప్రకారం.. రష్యాలోని పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో ఉత్తర కొరియాకు చెందిన ప్రత్యేక క్షిపణి విభాగాన్ని మోహరించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ తెలిపింది. యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఇప్పటికే ఉత్తర కొరియా సైనికులు, ఆయుధాలను అందిస్తుండగా.. ఇప్పుడు క్షిపణి విభాగాన్ని కూడా రంగంలోకి దించడం రెండు దేశాల మధ్య సైనిక సహకారం ఏ స్థాయికి చేరిందో సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా-ఉత్తర కొరియా మధ్య సైనిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా ప్రత్యక్షంగా మరింతగా భాగస్వామ్యం కావడం వల్ల యుద్ధ తీవ్రత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్షిపణి విభాగం మోహరింపుపై రష్యా లేదా ఉత్తర కొరియా నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.







