UPDATES  

NEWS

 కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ నాయకుల ముందు తెలంగాణ నాయకులు వణుకుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే అన్నారు. తెలంగాణ భవన్ లో హైదర్ నగర్ డివిజన్‌కు చెందిన నాయకులను బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ అయితే, బీజేపీ చెప్పులు మోసే పార్టీ అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్, బీజేపీలను మరోసారి నమ్మితే తెలంగాణను ఢిల్లీకి లేదా గుజరాత్‌కు అమ్మేస్తారనని కేటీఆర్ విమర్శించారు. అమిత్ షా ముందు బండి సంజయ్ బౌన్సర్ కంటే దారుణంగా తయారయ్యారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రజల గౌరవాన్ని దిగజార్చవద్దని బండి సంజయ్‌కు హితవు పలికారు. అమిత్ షా తెలంగాణకు వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారని.. రాష్ట్రానికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క మెట్రో ప్రాజెక్టు గానీ, జాతీయ ప్రాజెక్టు గానీ, విద్యాసంస్థను ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని పేర్కొన్నారు.

Advertisement

తనకంటే చిన్నవాడైన అమిత్ షా కాళ్లకు రాంచందర్ రావు నమస్కరించడం ఏంటని ప్రశ్నించారు. అంతగా దిగజారి వ్యవహరించాలా? అని నిలదీశారు. అటు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాజెక్టుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టి.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పగబట్టి నీటిని ఎత్తిపోయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నా ప్రజలకు, రైతులకు అందించలేని దుస్థితి నెలకొందని కేటీఆర్ ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో మళ్లీ తాగునీటి సమస్య తలెత్తిందని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ మహానగరానికి నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో నగర జనాభా పెరిగినా తాగునీటి కొరత రాకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. అలాంటి ప్రాజెక్టులు, నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

Advertisement

మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను తీర్పు వచ్చిన 24 గంటల్లోనే అమ్మేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కేవలం కమీషన్ల కోసం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, మియాపూర్ భూముల్లో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, హైదరాబాద్ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో కమీషన్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన విలువైన భూములను ప్రైవేటు ప్రయోజనాల కోసం విక్రయించడం దారుణమని విమర్శించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |