UPDATES  

NEWS

 ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం,ఆస్తిపత్రాలు..

పురపాలక ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, జరిపిన సోదాల్లో సుమారు రూ. 4.75 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.

మంగళవారం హైదరాబాద్‌తో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. యాదగిరి రావు నివాసం, కార్యాలయం, బంధువులు, బినామీలకు సంబంధించిన ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి.

ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉప్పల్ హైకోర్టు కాలనీలో 334 గజాల స్థలంలో నిర్మించిన G+3 భవనం విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు ఉప్పల్‌లోనే రెండు ఫ్లాట్లు, ఒక వాణిజ్య దుకాణం, హబ్సిగూడ, పెద్ద అంబర్‌పేట్, మేడిపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మొత్తం 12 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు పత్రాలను గుర్తించారు.

సోదాల్లో సుమారు 1.8 కిలోల బంగారం (1,792 గ్రాములు), 3 కిలోల వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 73 లక్షల విలువైన టయోటా ఫార్చూనర్, మరో కారు, మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. 32.30 లక్షల నగదు నిల్వలు, రూ. 29 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 7 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉన్నట్లు తేలింది.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ. 4.75 కోట్లుగా లెక్కగట్టామని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. యాదగిరి రావు కుమారుడికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న రబ్బర్ ఫ్యాక్టరీ, ట్రాన్స్‌మిషన్ పరిశ్రమల్లోని పెట్టుబడులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, యాదగిరి రావును ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |