UPDATES  

NEWS

 ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం: జగన్..

రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొత్తుగా మారిందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలే ఇందుకు నిదర్శనమని ఆయన ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణమని ఆయన మండిపడ్డారు.

పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లకు గాను 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. పోలీసుల సహకారంతోనే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు దాడులకు పాల్పడి, తమ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాగేశారని తెలిపారు. ఓటర్ల స్లిప్పులు లాక్కొని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్‌కు పాల్పడ్డారని, వీటికి స్పష్టమైన వీడియో ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

అయితే, 70 బూత్‌లలో అక్రమాలు జరిగితే, కేవలం 4 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించడం దారుణమని జగన్ అన్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్య కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వాటిని స్వేచ్ఛాయుత ఎన్నికలు అంటారా? అంటూ ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తరహా ఘటనలు కేవలం పులివెందులకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా జరిగాయని జగన్ తెలిపారు. కడప, తిరుపతి, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లతో పాటు మాచర్ల, కుప్పం, పుత్తూరు, నంద్యాల వంటి అనేక మున్సిపాలిటీల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని… గెలుపు ఆలస్యమైనా అంతిమంగా న్యాయం, ధర్మమే గెలుస్తాయని ఆయన పునరుద్ఘాటించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |