UPDATES  

NEWS

 అర్నబ్ తుపాను తాకిడికి కోనసీమ అతలాకుతలం..

మామూలుగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాలు భలే హాయిగా ప్రశాంతంగా ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. తుపాను వస్తే మాత్రం ఎటు చూసినా ప్రళయ ప్రకృతి కోపంతో చేసిన విధ్వంస సంతకాలే కనపడతాయి. తుపానులు గోదావరిప్రాంతానికి కొత్త కాదు. అకాల వర్షాలు ముంచెత్తే వరదలు.. జీవితాలు ముంచేసే ప్రళయాలూ కొత్తకాదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రళయకాలం తన్నుకుపోవడం కొత్త కాదు. ఇంట్లో ఇల్లాలి తాళిబొట్టు అమ్మి చేసిన వ్యవసాయం నీరుగారిపోతే రైతు కుటుంబాల ఇంట కన్నీటి సాగు కొత్త కాదు. ప్రళయాలు వస్తాయి పోతాయి. కాకపోతే ఏటా విషాదాన్ని మోసుకొచ్చే ప్రళయాల పేర్లు మారతాయంతే. తాజా విషాదం పేరు అర్నబ్.

ఎదిగిన కొడుకును చూసుకుని చెట్టంత కొడుకు ఉన్నాడని తల్లి దండ్రులు మురిసిపోతారు ఎక్కడైనా. కోనసీమలో మాత్రం ఎదిగిన కొబ్బరి చెట్లను తమ కొడుకుల్లాగే సాకుతారు రైతులు. కొడుకంత చెట్టని చెప్పుకుంటారు. కొబ్బరి చెట్టుకు మామూలు తెగులు సోకితేనే కొడుక్కి పెద్ద వ్యాధి వచ్చినంతగా అల్లాడిపోతారు కోనసీమ వాసులు. అటువంటిది అర్నబ్ వచ్చి ఒక్కసారిగా 33 వేలకు పైగా కొబ్బరి చెట్లను నేల కూల్చింది. తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను చూసుకుని కోనసీమ రైతులు ఇపుడు పుత్రశోకంతో రోదిస్తున్నారు. వారి బాధ వర్ణనాతీతం. దాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరూ ఓదార్చనూ లేరు. ఎందుకంటే ఆ కొబ్బరి చెట్లు మళ్లీ లేచి నిలబలేవు కదా..

భీకర గాలులు నిర్దాక్షిణ్యంగా కోసుకుంటూ వచ్చాయి. గాలి విసిరిన కత్తికి వేలాది ఎకరాల్లో అరటి చెట్లు తలలు వాల్చేశాయి. లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో ఆకుపచ్చ తివాచీ పరిచినట్లుండే వరి పొలాలు నీట మునిగాయి. రక్షించండి అంటూ వరి కంకులు గాల్లో తేలి కళ్లు మూశాయి. నీరు తిన్న వరి పంటను చూసుకుని రైతులు విలవిల్లాడిపోయారు. దేవుడు ఎందుకిలా కక్షగట్టాడురా నాయనా అంటూ రైతు కుటుంబాలు భోరు మంటున్నాయి. వారి కళ్లల్లో కన్నీరు గడ్డకట్టేసింది.

16 వేలకు పైగా కరెంట్ స్తంభాలూ..

కోనసీమ పొడవునా రహదారుల వెంబడి వేలాది చెట్లు శత్రువులు తెగనరికినట్లు రోడ్లపై అడ్డంగా రాలి పడ్డాయి. జల ఖడ్గాలు రహదారులను నరికేశాయి. గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి. 16 వేలకు పైగా కరెంట్ స్తంభాలూ నేలరాలాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలకు ఈ చీకటి బోనస్.

అపార నష్టం వచ్చింది. అనంత దుఖం పెల్లుబికింది.అసంఖ్యాక పేదల జీవితాలు రోడ్డున పడ్డాయి. చెట్లకింద నలిగి పూరిళ్లు ఉస్సూరు మన్నాయి. ప్రభుత్వాధికారుల నుండి అందాల్సిన సాయం అందడం లేదని బాధిత కుటుంబాలు భగ్గుమంటున్నాయి. ఈ కష్టం కోనసీమకు కొత్తకాదు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. నష్ట తీవ్రతను తగ్గించుకునే ఆలోచనలే తప్ప ప్రళయాన్ని ఆపగలిగే సత్తా లేదు కదా.సర్వం కోల్పోయిన వారిని ఆదుకుని మేమున్నామన్న ధైర్యం చెప్పాల్సిన బాధ్యత పాలకులదే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |