UPDATES  

NEWS

 రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ బంద్..! అదే కారణమా..?

రైలు ప్రయాణికుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలోని అన్ని కోచ్‌లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు అక్టోబర్ 26న ఆదేశాలు జారీ చేసింది. అగ్నిప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ నిబంధనను ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఓ రైలులో రాత్రిపూట ఛార్జింగ్ పెట్టిన ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలి పొగలు వ్యాపించాయి. నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఛార్జింగ్ పాయింట్లను సిబ్బంది నిలిపివేయాల్సి ఉన్నా, వారు నిర్లక్ష్యం చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పాత నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

వాస్తవానికి ఈ నిబంధన కొత్తదేమీ కాదు. 2013లో హజూర్ సాహిబ్ నాందేడ్ – కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తర్వాత, రైల్వే భద్రతా కమిషనర్ సిఫార్సుల మేరకు 2014లోనే రైల్వే బోర్డు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే, కొన్నిచోట్ల ఇది సరిగా అమలు కావడం లేదని బోర్డు గుర్తించింది.

తాజా ఆదేశాల ప్రకారం, ఈ నిబంధన అమలును పర్యవేక్షించేందుకు సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని, అధికారులు, సూపర్‌వైజర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రాత్రిపూట ఛార్జింగ్ వల్ల అగ్నిప్రమాదాలే కాకుండా, విలువైన వస్తువుల దొంగతనం జరిగే ప్రమాదం కూడా ఉందని గతంలోనే పలు రైల్వే జోన్లు హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |