UPDATES  

NEWS

 ఎర్రవల్లి భూముల సర్వేలో మరో ట్విస్ట్‌.. 180 ఎకరాలు మావేనంటున్న రైతులు..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూముల సర్వేలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాల భూమిపై రెవెన్యూ, సర్వే అధికారులు చేపట్టిన సర్వే మూడో రోజుకు చేరుకోగా, ఈ వివాదంలోకి పొరుగున ఉన్న వెంకటాపూర్ గ్రామస్థులు ప్రవేశించారు. సర్వే చేస్తున్న భూమిలో తమ వాటా కూడా ఉందని వారు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

వివరాల్లోకి వెళితే, సర్వే నంబర్ 325 కింద ఉన్న మొత్తం 388 ఎకరాల భూమిలో కేవలం 250 ఎకరాలు మాత్రమే ఎర్రవల్లికి చెందినవని, మిగిలిన సుమారు 180 ఎకరాలు తమ వెంకటాపూర్ గ్రామ పరిధిలోకి వస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పొరపాటున తమ గ్రామ పరిధిలోని భూమిని ఎర్రవల్లి సర్వే నంబర్‌లో కలిపారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఖస్రా, సేత్వార్ పహాణీ వంటి పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వేను పక్కాగా నిర్వహించి, తమ భూమిని గుర్తించి వేరు చేయాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, అధికారులు తమ సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ భూమిని ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులను గుర్తించే పనిలో భాగంగా వారికి నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. మొత్తం 215 మందికి నోటీసులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, శనివారం ఒక్కరోజే సుమారు 50 మందికి నోటీసులు అందజేశారు. నిర్దేశిత తేదీల్లో రైతులు తమ భూముల వద్దకు వచ్చి, సంబంధిత వివరాలు అందించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 21 నుంచి నాలుగు దశల్లో సర్వేను కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం భూమిని సాగు చేస్తున్న, అనుభవంలో ఉన్న రైతులను గుర్తించేందుకు ‘ఎంజాయ్‌మెంట్ సర్వే’ కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అయితే, వెంకటాపూర్ గ్రామస్థుల వాదనతో ఈ సర్వే ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. రెండు గ్రామాల మధ్య నెలకొన్న ఈ సరిహద్దు వివాదాన్ని అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |