UPDATES  

NEWS

 దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులకు ఎస్‌బీఐ కీలక సూచన..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. 

అయితే, దీనికి ముందు సెప్టెంబర్ 26, 27 తేదీలు శని, ఆదివారాలు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలలో ప్రత్యక్ష సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నవారు సమ్మె కంటే ముందే వాటిని పూర్తి చేసుకోవాలని సూచించింది.

యూఎఫ్‌బీయూ తమ ఆందోళనలో భాగంగా ఇప్పటికే సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మె నిర్వహించింది. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల చివరలో మరోసారి నిరసనకు సిద్ధమైంది. అంతేకాకుండా అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు కూడా పిలుపునివ్వడంతో బ్యాంకింగ్ రంగంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్‌బీఐ ఈ ముందస్తు సలహాలు జారీ చేసింది.

సమ్మె సమయంలో బ్రాంచ్‌లలో సిబ్బంది సహాయం అవసరమయ్యే పనులు, డాక్యుమెంట్ల పరిశీలన, కొన్ని రకాల చెక్కుల ప్రాసెసింగ్ వంటి సేవలకు ఆటంకం కలగవచ్చని బ్యాంకు స్పష్టం చేసింది. సమ్మెలో ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటారనే దానిపై బ్రాంచ్‌ల పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. అయితే, వినియోగదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని కోరింది.

నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లు (ఏడీడబ్ల్యూఎం), అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్‌పీ) అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ పేర్కొంది. వీటితో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథాతథంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. 

నిధుల బదిలీ, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి వాటిని ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకోవచ్చని వివరించింది. అయితే, భౌతికంగా బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనులను మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని ఖాతాదారులకు సూచించింది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |