UPDATES  

NEWS

 డీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకొస్తా: జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసత్యాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే సమగ్రంగా ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తికి/సంస్థకు ఎలా అప్పగిస్తారని జగన్ ప్రశ్నించారు. ఎస్‌సీఈఆర్‌టీ విభాగంలో పనిచేస్తున్న నవీన్ అనే అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అసలు మొదటి ర్యాంక్ సాధించిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు.

జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఎందుకు మార్చారు? పరీక్షలు నిర్వహించకుండానే 372 మందికి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. ‘జూడో’ అనే ఆట కింద ఏకంగా 39 మందికి అక్రమంగా సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.

మెగా డీఎస్సీ అక్రమాలపై తమ పార్టీ ఆధారాలతో సహా నిలదీస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం వచ్చి బీపీ పెరుగుతోందని, మంత్రి నారా లోకేశ్ ను కాపాడుకోవడానికి ప్రభుత్వం తాపత్రయపడుతోందని జగన్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |