UPDATES  

NEWS

 తొలగింపు కాదు.. రాజీనామానే: కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం నిర్ణయం..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం కంటే, గౌరవప్రదంగా రాజీనామా చేయించడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లుతుందని సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి నివేదించినట్లు తెలిసింది. కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహారశైలిపై, అలాగే మంత్రుల పనితీరుపై ఆయన ఒక నివేదికను అందజేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం పిలుపు మేరకు మంత్రి కొండా సురేఖ సైతం ఢిల్లీకి చేరుకున్నారు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చి, ఆమెతో రాజీనామా చేయించేందుకే ఢిల్లీకి పిలిపించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, కేసీ వేణుగోపాల్ ఈ అంశంపై పలువురు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌లతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సంప్రదింపులు పూర్తయ్యాకే కొండా సురేఖపై తుది నిర్ణయం వెలువడనుంది.

ఈ పరిణామాల మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున, అధిష్ఠానం ప్రస్తుతం సురేఖ అంశంపైనే దృష్టి సారించిందని, పునర్వ్యవస్థీకరణపై తర్వాత నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తాను ఇచ్చిన నివేదికలో కఠిన చర్యలు సిఫార్సు చేశానని, అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |