UPDATES  

NEWS

 చికెన్ కోసం ఘోరం..! ముక్కలు కోసం స్నేహితుడి దారుణ హత్య..!

కూలి పనులు చేసుకుంటూ ఒకే గదిలో ఉండే ఇద్దరు స్నేహితుల మధ్య చికెన్ కూర చిచ్చుపెట్టింది. ఎక్కువ ముక్కలు తింటున్నాడనే కోపంతో మెుదలైన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. మరొకరిని జైలు పాలు చేసింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ విచిత్ర ఘటన.. స్థానికంగానే కాకుండా సోషల్ మీడియా వేదికగా చర్చకు తావిచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌ జిల్లాకు చెందిన సీతారామ్, అరుణ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బెళగావిలోని ఒక స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు మరో నలుగురు కార్మికులతో కలిసి స్థానిక షెడ్డులో నివాసముంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అందరూ కలిసి మద్యం తాగి, చికెన్ వండుకున్నారు. భోజనం చేస్తున్న సమయంలో ‘నువ్వు నాకంటే ఎక్కువ చికెన్ ముక్కలు తింటున్నావ్’ అని అరుణ్‌ను సీతారామ్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది.

ఆ సమయానికి ఇద్దరూ తీవ్ర మద్యం మత్తులో ఉండటంతో చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఆవేశంతో రగిలిపోయిన అరుణ్.. గదిలో ఉన్న కత్తితో సీతారామ్ ఛాతిపై బలంగా పొడిచాడు. అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కంగారుపడిన అరుణ్.. తోటి కార్మికులతో కలిసి హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఘటనను కప్పిపుచ్చేందుకు అరుణ్ ఆస్పత్రిలో కొత్త డ్రామాకు తెరలేపాడు. బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడని వైద్యులకు, పోలీసులకు అబద్ధం చెప్పాడు.

పోలీసుల దర్యాప్తులో అసలు నిజం..

మరోవైపు తీవ్రంగా గాయపడిన సీతారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో అరుణ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. మద్యం మత్తులో చికెన్ ముక్కల కోసం గొడవపడి పొడిచినట్లు నిందితుడు అంగీకరించాడు.

ఈ ఘటనపై బెళగావి ఎస్పీ కె. రామరాజన్ స్పందిస్తూ.. ‘ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించి నిందితుడు దాచాలని చూశాడు. కానీ లోతుగా విచారణ జరిపిన తర్వాత ఇది పక్కా ప్రణాళిక లేకపోయినా క్షణికావేశంలో జరిగిన హత్య అని తేలింది’ అని ఎస్పీ వెల్లడించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరుణ్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |