మాదాపూర్: అయ్యప్ప సొసైటీలోని ప్రైమ్ ఫార్మసీలో SOT సైబరాబాద్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న **6,568 ట్రామాడోల్ మాత్రలు (821 స్ట్రిప్స్)**ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఫార్మసీ యజమాని తోర్రి వెంకటేశం (32), డెలివరీ బాయ్ బర్లకడి శ్రీకాంత్ (32)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో నారాయణ్‌ఖేడ్‌కు చెందిన రాథోడ్ ప్రకాష్ (A-3) నుంచి నిందితులు ఈ మాత్రలను అక్రమంగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. గత కొన్ని నెలలుగా దాదాపు 100 నుంచి 150 మందికి పైగా ట్రామాడోల్ మాత్రలను విక్రయించినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కేసులో పరారీలో ఉన్న A-3తో పాటు ఈ మందులను కొనుగోలు చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సైకోట్రోపిక్ మందులను విక్రయించడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మందులను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








