UPDATES  

NEWS

 గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో నారా లోకేశ్ భేటీ..!

ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు తీరప్రాంత రాష్ట్రాల పరస్పర సహకారంతో దేశాభివృద్ధికి దోహదపడే పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముఖ్యమంత్రి ముందుంచారు. ముఖ్యంగా, గుజరాత్ పశ్చిమ తీరాన్ని, ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన్ని కలుపుతూ ‘కోస్ట్ టు కోస్ట్’ వాణిజ్య కారిడార్ ఏర్పాటు ఆవశ్యకతను లోకేశ్ నొక్కిచెప్పారు.

ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక ప్రగతిలో కీలకమైన తీరప్రాంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. తూర్పు తీరానికి గేట్‌వేగా ఉన్న ఏపీ, పశ్చిమ తీరంలో కీలకంగా ఉన్న గుజరాత్ సమన్వయంతో పనిచేస్తే సముద్ర, పోర్టుల ఆధారిత పరిశ్రమలు గణనీయమైన వృద్ధిని సాధిస్తాయని వివరించారు. గుజరాత్ మోడల్ స్ఫూర్తితోనే ఏపీలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట వంటి నాన్-మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ, ప్రైవేట్ పోర్టుల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను పంచుకునేందుకు ‘కోస్ట్ టు కోస్ట్’ లాజిస్టిక్స్, వాణిజ్య కారిడార్ ఎంతో ఉపకరిస్తుందని ప్రతిపాదించారు.

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ (GIFT City) ఫ్రేమ్‌వర్క్‌ను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దీనిని ఆదర్శంగా తీసుకుని, ఏపీలోని విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లో ఆధునిక బిజినెస్ డిస్ట్రిక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గిఫ్ట్ సిటీలో అమలు చేస్తున్న సింగిల్-విండో క్లియరెన్స్, డెవలపర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలపై తమకు అవగాహన కల్పించి, సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్ (కాకినాడ హబ్), ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల (కొప్పర్తి, ఓర్వకల్లు) ఏర్పాటు ద్వారా పారిశ్రామిక సప్లయ్ చైన్‌ను పటిష్ఠం చేస్తున్నామని సీఎంకు వివరించారు.

అదేవిధంగా, అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ పున్నమి ఘాట్‌లో జరగనున్న ‘విజయవాడ ఉత్సవ్‌’కు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు కూడా రావాలని కోరారు. గుజరాత్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం ఉందని, ఇందుకు అవసరమైన భూమిని కేటాయించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ వెంట రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కూడా ఉన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |