UPDATES  

NEWS

 సుప్రీంకోర్టు తీర్పు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు:కేటీఆర్..!

దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అనర్హత నుంచి తప్పించుకునేందుకు దానం నాగేందర్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థిస్తూ స్పష్టమైన నిర్ణయం వెలువరించిందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజల మద్దతును కాజేయాలని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి భావించారని విమర్శించారు. ఫిరాయింపుదారులను స్పీకర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కాపాడుకోవచ్చని వారు భావించారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్, రేవంత్ చేసిన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్‌ ప్రజలు త్వరలో తమ తీర్పును ఇవ్వబోతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల మోసం, విఫలమైన హామీలు, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడం, పాలనా వైఫల్యాలపై ఖైరతాబాద్‌ ప్రజలు తమ తీర్పును చెప్పనున్నారని అన్నారు. దానం నాగేందర్‌ అనర్హతతో ఒక వికెట్‌ పడిందని ఇక ముందు మరిన్ని వికెట్లు పడనున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యే దొంగ’ అంటూ విమర్శించారు.

మరోవైపు ఎన్నికల సంఘం తీరుపై కూడా కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ.. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా.. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నట్టుందని ప్రశ్నించారు.

ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే.. ‘అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?’ అని కేటీఆర్ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపులు బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో ఎక్కువ ఉండటం పట్ల కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కు అవుతున్నాయని ఆరోపించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |