దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌తో పాటు ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET-UG పరీక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ‘పెన్ అండ్ పేపర్’ (ఆఫ్‌లైన్) విధానాన్ని మార్చి, జేఈఈ తరహాలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
ఇటీవల వెలుగుచూసిన నీట్ ప్రశ్నపత్రాల లీకులు, పరీక్ష నిర్వహణలో తలెత్తిన లోపాలను నివారించేందుకు ఈ మార్పులు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. నందన్ నిలేకని నేతృత్వంలోని హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆన్‌లైన్ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కమిటీ నివేదిక అనంతరం పరీక్ష విధానంలో కీలక మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








