UPDATES  

NEWS

 YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీ తొలగింపు..! కారణం అదేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగలు సోషల్ మీడియా వేదికగా మరోసారి రాజుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారిక ఫేస్‌బుక్ పేజీ హఠాత్తుగా అందుబాటులో లేకపోవడంపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

 

ప్రజాస్వామ్య విలువలపై దాడి

ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ‘ఈ ఏడాది ప్రారంభంలోనే మా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తొలగించారు, ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీని కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇది కేవలం వైఎస్సార్‌సీపీపై జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం తమ విధి అని, నిజాలు మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.

 

అవినీతిని ప్రశ్నించినందుకేనా?

రాజధాని పేరుతో  జరుగుతున్న దుబారా ఖర్చులు, డీఎస్‌సీ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, అలాగే టీటీడీ నెయ్యి టెండర్లలో జరిగిన అవినీతి అక్రమాలను తాము సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచామని జగన్ గుర్తుచేశారు. ఈ నిజాలు బయటపడటంతో తట్టుకోలేకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ ఖాతాలను నిలిపివేయించిందని ఆరోపించారు. సత్యం మాట్లాడే ప్రతిపక్షం గొంతు నులిమేయడం ప్రమాదకరమైన, అత్యంత అప్రజాస్వామికమైన చర్య అని ఆయన హెచ్చరించారు.

 

న్యాయపోరాటానికి సిద్ధం

 

ఇలాంటి బెదిరింపులకు, అణచివేత చర్యలకు తాము భయపడే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా తమ పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఈ అప్రజాస్వామిక చర్యపై న్యాయపోరాటం చేస్తామని జగన్ హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |