UPDATES  

NEWS

 ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,234.91 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెటరీ మద్దతు ద్వారా భరించనుంది.

 

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడ‌బ్ల్యూడీ) చేపట్టనుంది. ఇప్పటికే ప్రీ-బిడ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, టెండర్ పత్రాల రూపకల్పన ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాజధాని అమరావతిలో కేంద్రం చేపడుతున్న మొట్టమొదటి జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం.

 

మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ జీపీఆర్ఏ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 11 నివాస టవర్లను ఏర్పాటు చేసి, టైప్-II నుంచి టైప్-VI వరకు వివిధ కేటగిరీలలో మొత్తం 1,504 ఫ్లాట్లను నిర్మిస్తారు. ప్రాజెక్టులో భాగంగా 1,972 కార్లు పార్క్ చేసుకునేలా బేస్‌మెంట్ పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ విస్తీర్ణం 31.30 లక్షల చదరపు అడుగులుగా ఉంది.

 

ప్రాజెక్ట్ లక్ష్యాలు.. ప్రయోజనాలు

అమరావతిలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారికి తగిన నివాస సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. కార్యాలయాలకు సమీపంలోనే నివాసం ఉండటం వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం, పనితీరు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగేందుకు దోహదపడుతుందని ప్రకటనలో వివరించారు.

 

పర్యావరణ హిత నిర్మాణం.. సకల సౌకర్యాలు

ఈ ప్రాజెక్టును పూర్తిగా పర్యావరణ హితంగా, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. కనీసం 4-స్టార్ గ్రీహా (జీఆర్ఐహెచ్ఏ) రేటింగ్ సాధించేలా, ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, స్థానిక నిర్మాణ సామగ్రి వాడకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. క్యాంపస్‌లో బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీసు, కమ్యూనిటీ హాల్, ఫుడ్ కోర్ట్, షాపింగ్ కాంప్లెక్స్, గెస్ట్ హౌస్ వంటి అన్ని రకాల పౌర, సామాజిక సదుపాయాలు ఉంటాయి. అలాగే, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అవరోధ రహిత వాతావరణాన్ని కల్పించనున్నారు.

 

ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. నిర్మాణ దశలో ఏటా సుమారు 7 లక్షల పనిదినాలు, ప్రాజెక్టు పూర్తయ్యాక నిర్వహణ దశలో ఏటా 50,000 పనిదినాల ఉపాధి కలుగుతుందని కేంద్రం తెలిపింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |