UPDATES  

NEWS

 జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు, పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 

డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన ప్రధాన కార్యదర్శి తమను కలిసి సభకు అనుమతి కోరారని తెలిపారు. ఈ సమావేశానికి సుమారు 2,000 మంది కార్యకర్తలు వస్తారని దరఖాస్తులో పేర్కొన్నారని చెప్పారు. అయితే, ఇటీవల ఏపీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలిపారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు కావడంతో ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని అన్నారు.

 

దీంతో పాటు, సభకు వచ్చే రెండు వేల మందికి సరిపడా పార్కింగ్ సౌకర్యం లేదని కూడా తెలిపారు. జనసేన నేతలు పార్కింగ్ కోసం ఎఫ్‌సీఐకి చెందిన భూమిని ఉపయోగించుకోవాలని భావించినా, ఆ భూమిపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించామని… ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో సభకు అనుమతి నిరాకరించినట్లు డీసీపీ స్పష్టం చేశారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |