UPDATES  

NEWS

 నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రెండో విడత పనులకు శంకుస్థాపన..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు జిల్లాలోని కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించనున్నారు.

 

కొత్తారి గ్రామంలో..

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవానికి సూచికగా కొత్తారి గ్రామంలో ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. పథకం అమలు, లబ్ధిదారుల అనుభవాలను ఈ సందర్భంగా ఆయన స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

 

కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌లో భారీ బహిరంగ సభ..

కొత్తారి గ్రామంలో కార్యక్రమాలు ముగించుకుని, సాయంత్రం 7:00 గంటలకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లాకు సంబంధించి పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.బహిరంగ సభ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగజ్‌నగర్ నుంచి రోడ్డు మార్గాన మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసానికి చేరుకుని, అక్కడ కొంతసేపు గడిపిన అనంతరం.. రాత్రి 10:00 గంటలకు మంచిర్యాల నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు భారీ బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |