UPDATES  

NEWS

 జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ‘జీరో’నే: మంత్రి నారాయణ

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా మంత్రి పి. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రక్తచరిత్ర ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసని, జగన్ అండ్ కో ఎన్ని అసత్యాలు మాట్లాడినా జనం నమ్మే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం, వైసీపీ రక్తచరిత్ర ప్రజలకు తెలుసు కాబట్టే… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, వచ్చే ఎన్నికల్లో వారికి సున్నా (జీరో) సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

గత వైసీపీ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను ఎందుకు వినియోగించలేదో జగన్ సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ నిధులను కూడా జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించి, ఎలాంటి అవినీతి లేకుండా నిజాయతీగా ఉద్యోగాలను కేటాయించిందని స్పష్టం చేశారు. ఇంత మంచి జరుగుతుంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై జగన్ అండ్ కో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో (ప్రత్యక్షంగా, వర్చువల్ గా) మహానాడు ఉంటుందని… గతంలో మాదిరే రాజకీయ తీర్మానాలు, ఆమోదాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఈ వేదికపై మాట్లాడే పూర్తి అవకాశం కల్పిస్తామన్నారు.

 

తన పర్యటనలో భాగంగా నెల్లూరు పరమేశ్వరనగర్ వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న మున్సిపల్ కార్పొరేట్ స్కూల్ ప్రాంతాన్ని నారాయణ సందర్శించారు. సామాన్య ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ధ్యేయంగా, స్విమ్మింగ్ పూల్‌తో సహా అన్ని రకాల ఆధునిక వసతులతో ఈ పాఠశాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాతల సహకారంతో నగరంలోని పలు మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి మారుస్తున్నామని, అలాగే ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో రూ. 1,400 కోట్లతో డ్రైనేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. మంత్రి పర్యటనలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు మేయర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |