UPDATES  

NEWS

 ఎల్‌నినో ఎఫెక్ట్..! తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని, దీన్ని అధిగమించేందుకు వెంటనే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ రుతుపవనాలు ప్రవేశించే వరకు సాగు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సీనియర్ అధికారులతో ఎల్‌నినో ప్రభావంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నీటిని, విద్యుత్‌ను చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్ అందుబాటులో లేదని, అందువల్ల విద్యుత్‌పై ఆధారపడిన పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఒక్క నీటిబొట్టు కూడా వృథా కాకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మీడియా, సినిమా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై మరింత లోతుగా చర్చించేందుకు అక్టోబర్ 12న అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీని తర్వాత రైతులతో కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక ఖరారు కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, దాదాపు 235 మండలాల్లో కరవు ఛాయలు అలముకున్నాయని అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ సబ్-కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కరవు ప్రభావిత మండలాలను ఆదుకునేందుకు రూ.20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. అక్టోబర్ 12న జరిగే సమావేశంలో వ్యవసాయం, సాగు, తాగునీటి లభ్యత, విద్యుత్ డిమాండ్, తక్షణ ఉపశమన చర్యలపై రైతు సంఘాలు, నిపుణుల సలహాలు కూడా తీసుకోనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |