భారత్ అంతర్గత వ్యవహారాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నేత జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. గతంలో భారత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని బెదిరింపులకు పాల్పడిన నేతలున్న నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) కన్వీనర్ నహీద్ ఇస్లాం, తాజాగా భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని నిరసనలకు మద్దతు ప్రకటించారు. శనివారం ఢాకా నుంచి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్‌లో “ఎన్నికల జవాబుదారీతనం” కోరుతూ జరుగుతున్న నిరసనలకు తమ సంఘీభావం ఉంటుందని నహీద్ ఇస్లాం తన ప్రకటనలో పేర్కొన్నారు. “మైనారిటీలు భయంతో జీవిస్తున్న ఏ సమాజమూ నిజమైన ప్రజాస్వామ్యం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై పదేపదే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన హింసాత్మక ఆందోళనల్లో నహీద్ పార్టీ నేతలు కీలక పాత్ర పోషించారు. వారి పార్టీ రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ అయిన జమాత్-ఎ-ఇస్లామీతో పొత్తు పెట్టుకుంది. 2025 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే 27 ఏళ్ల హిందూ యువకుడిని మత దూషణ ఆరోపణలతో ఒక గుంపు నడిరోడ్డుపైకి లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి చంపి, ఆ తర్వాత నిప్పంటించింది.
గతంలో ఎన్‌సీపీ నేతలు పలుమార్లు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా, భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను (సెవెన్ సిస్టర్స్), సిలిగురి కారిడార్‌ను స్వాధీనం చేసుకుంటామని బెదిరించినట్లు యూత్ టిప్రా ఫెడరేషన్ (వైటీఎఫ్) అధ్యక్షుడు సూరజ్ దెబ్బర్మ గతంలో ఆరోపించారు. భారత వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ అగర్తలలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ వద్ద నిరసనలు కూడా తెలిపారు. ఇలాంటి వివాదాస్పద చరిత్ర ఉన్న పార్టీ నేత ఇప్పుడు భారత అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.









