UPDATES  

NEWS

 రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల కష్టాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏ స్థాయిలో దాపురించాయో వివరించిన ఆయన, ఈ సంక్షోభం నుంచి అన్నదాతలను గట్టెక్కించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

 

రాష్ట్రంలో దాదాపు 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 688 మండలాలకు గాను 628 మండలాలు కరువు నీడలోనే ఉన్నాయన్నారు. అందులో 332 మండలాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు వంటి జిల్లాల్లో వర్షపాతం లోటు 55 నుంచి 75 శాతం వరకు ఉందన్నారు. ప్రతిఏటా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా.. కేవలం 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని, దాదాపు 20 లక్షల ఎకరాల్లో అసలు విత్తనం కూడా పడలేదని వివరించారు. సాగు చేసిన పంటలు కూడా ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

ఫిబ్రవరిలోనే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని సమాచారం ఉన్నా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని జగన్ విమర్శించారు. శ్రీశైలం నీటిని సమయానికి రాయలసీమకు మళ్లించడంలో, తెలుగుగంగ, SRBC, కేసీ కెనాల్ పరిధిలోని రిజర్వాయర్లను నింపడంలో విఫలమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం విషయంలో రాజీపడుతోందని, పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్‌లపై మౌనం వహిస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వానికి జగన్ డిమాండ్లు

రాష్ట్రంలోని కరువు మండలాలను వెంటనే అధికారికంగా ప్రకటించి, విత్తనం వేయని రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, పంట నష్టపోయిన వారికి రూ. 25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ. 3,000 కోట్ల బీమా పరిహారాన్ని, ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 6,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద బకాయి ఉన్న రూ. 41,000 రూపాయలతో పాటు, సున్నా వడ్డీ బకాయిలను చెల్లించాలని.. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచాలని, ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలన్నారు. రూ. 9,000 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేసి పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని వైఎస్సార్‌సీపీ జగన్ డిమాండ్ చేశారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతోందని తెలిపారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందించాలని నాయకులకు సూచించారు. అవసరమైతే పరిస్థితి తీవ్రతను బట్టి తానూ స్వయంగా కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని జగన్ స్పష్టం చేశారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |