UPDATES  

NEWS

 బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్..!

రాష్ట్రంలోని అన్ని రంగాలను, వర్గాలను బలోపేతం చేసేలా రుణాలను అందించాలని, లక్ష్యాలను చేరుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. అమరావతిలో బుధవారం జరిగిన 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన పాల్గొని, వివిధ అంశాలపై అధికారులకు, బ్యాంకర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రయోజనం ఏముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మొత్తం గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో మంజూరు జరగలేదు. కొన్ని బ్యాంకులు ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి” అని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యం ఉందని, ఇందుకు బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు అందించి సహకరించాలని కోరారు.

స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు రుణాల చెల్లింపులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. “రుణాలు తీసుకున్న వారిలో 99 శాతానికి పైగా మహిళలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ఎస్‌హెచ్‌జీ మహిళలు దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచారు. కేవలం 0.67 శాతం మంది మాత్రమే చెల్లింపుల్లో విఫలమవుతున్నారు. వీరి నుంచి బకాయిలు వసూలు చేసేందుకు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ (ఓటీఎస్) విధానంపై ఆలోచించాలని బ్యాంకులకు సూచిస్తున్నాను” అని వివరించారు.

రాష్ట్రంలో 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే ఎల్‌నినో కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రతికూలతలను అధిగమించి ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా, రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలకమైన కౌలు రైతులకు రుణాలు సమృద్ధిగా అందించేందుకు బ్యాంకులు చొరవ చూపాలని ఆయన కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |